బీఆర్ఎస్​ హయాంలో భూ కుంభకోణం.. మంత్రి అండతో ప్రభుత్వ భూమి అక్రమ బదలాయింపు... 

  • కలెక్టర్​ అమోయ్​ కుమార్ ​మరో మాయ
  • ట్రాన్స్​ఫరయ్యే రోజే.. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ
  • అప్పటి ఎమ్మార్వోరిజెక్ట్ చేసినా.. అప్రూవ్
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ మంత్రి అండతో అక్రమ బదలాయింపు

ఘట్​కేసర్, వెలుగు:మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాలోని ఓఆర్ఆర్​కు అతి సమీపంలోని ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన 12 ఎకరాల సర్కార్ భూమిని అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి కలెక్టర్​అమోయ్​కుమార్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. గత బీఆర్ఎస్ సర్కార్​లోని ఓ మంత్రి అండతో తను ట్రాన్స్​ఫర్​అయ్యే రోజు వారి పేరు పైకి బదలాయించారు. అప్పటి ఎమ్మార్వో రిజెక్ట్ చేసినప్పటికీ ఆమోయ్​కుమార్ ప్రభుత్వ భూమిని వారికి కట్టబెట్టారు.

జిల్లాలోని ఘట్కేసర్ మండలం కొర్రెముల రెవెన్యూ గ్రామ పరిధిలోని వెంకటాపూర్ 174 సర్వే నంబరులో 18.12 ఎకరాల సర్కార్ భూమి ఉంది. 2017లో ఇందులో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి 6.12 ఎకరాలు కేటాయించగా, మిగిలిన 12 ఎకరాల భూమి సర్కార్ ఆధీనంలోనే ఉండేది. అయితే, ఆ భూమి 2023 అక్టోబర్ 12న ఉన్నఫలంగా మాజీ ఎంపీటీసీ కుటుంబసభ్యుల పేరుపైకి మారింది. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అయోయ్​కుమార్​కు 2023 అక్టోబర్ 12న మేడ్చల్​జిల్లా కలెక్టర్​గా చివరి వర్కింగ్​డే. ఆ మరురోజే అంటే అక్టోబర్​13న కలెక్టర్ గా గౌతమ్ బాధ్యతలు స్వీకరించారు.

అమోయ్​కుమార్​ట్రాన్స్​ఫర్​అయ్యేరోజే.. భూమి పట్టాలు మారినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.​​ 2023కు ముందు రెవెన్యూ రికార్డులు ఈ సర్వే నంబరు భూమి సర్కార్ భూమిగా చూపుతుండగా, ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తుల పేరుపైకి ట్రాన్స్​ఫర్ అయినట్లు కనబడుతున్నది. అయితే ఆ సమయంలో జిల్లా కలెక్టర్​గా పని చేసిన అమోయ్ కుమార్ కనుసన్నలలోనే ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరిగినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అప్పటి ఘట్​కేసర్ తహసీల్దార్ కృష్ణ ప్రభుత్వ భూమి బదలాయింపును రిజెక్ట్ చేసినా కూడా.. అయోయ్​కుమార్​ఆ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసినట్లు తెలుస్తున్నది.